కర్నూలులో భారీ చోరీ గుట్టురట్టు
మూడు రోజుల్లోనే కేసు ఛేదించిన నాల్గవ పట్టణ పోలీసులు
ఫ్లైఓవర్ వద్ద పోలీసుల వల.. ఇద్దరు నిందితులు అరెస్ట్
20 తులాల బంగారం రికవరీ.. పల్సర్ బైక్ స్వాధీనం
సీసీ కెమెరాలు, ప్రత్యేక బృందాల నిఘా.. చోరీ కేసులో వేగవంతమైన దర్యాప్తు
కర్నూలు క్రైమ్, అక్టోబర్ 06, (సీమకిరణం న్యూస్) :
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టపగలు జరిగిన చోరీ కేసును సుమారు 72 గంటల్లోనే ఛేదించిన పోలీసులు.. నిందితుల నుంచి రూ.20 లక్షల విలువైన 20 తులాల బంగారు ఆభరణాలను, నేరానికి ఉపయోగించిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగింది..?
కర్నూలు–కొడుమూరు రోడ్డులోని సీతారామ వెంచర్‌లో నివాసం ఉంటున్న ఆలివేలు శ్రావణి ఇంట్లో ఈ నెల 3న దుండగులు చొరబడి బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కర్నూలు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 4వ పట్టణ సీఐ బి.వి. విక్రమ్ సింహా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఫ్లైఓవర్ వద్ద పోలీసుల వల..
హైదరాబాద్ హైవేపై వెంకటరమణ ఫ్లైఓవర్ సమీపంలో పల్సర్ బైక్‌పై ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో వెలుగులోకి అసలు విషయం…
పోలీసుల విచారణలో బుధవారపేటలోని గౌరీ గోపాల్ ఆసుపత్రి వెనుక ఉన్న హబీబ్ ముబారక్ నగర్‌కు చెందిన షేక్ పైజాస్ (19), మరో 17 ఏళ్ల మైనర్ బాలుడు కలిసి చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వారి వద్ద నుంచి చోరీకి గురైన రూ.20 లక్షల విలువైన 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు నేరానికి ఉపయోగించిన పల్సర్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేసిన నాల్గవ పట్టణ పోలీసుల దర్యాప్తు బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.