తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. ఇద్దరు అరెస్ట్
కర్నూలు క్రైమ్ , జూలై 29, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లాలో ‘తల్లికి వందనం’ పథకం పేరుతో సైబర్ మోసానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఎయిర్‌టెల్ సిమ్‌లను విక్రయించే సేల్స్ పర్సన్స్‌గా పనిచేసిన ఉపేంద్ర మరియు వీరారెడ్డి సిమ్‌లు విక్రయించే సమయంలో బాధితుల ఆధార్ వివరాలు సేకరించారు. అనంతరం వారి వేలిముద్రలు, బ్యాంకు ఖాతా వివరాలను దుర్వినియోగం చేసి, 28 మంది లబ్ధిదారుల ఖాతాల నుంచి నగదు అక్రమంగా మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులైన ఉపేంద్ర, వీరారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆధార్, బ్యాంకు వివరాలు, వేలిముద్రలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులకు ఇవ్వొద్దని పోలీసులు సూచించారు.