తప్పుడు పార్కింగ్.. ప్రాణాలకు ముప్పు
బ్లైండ్ స్పాట్‌గా మారిన సర్వీస్ రోడ్డు
జాతీయ రహదారిపై వాహనాలను పార్క్ చేయవద్దు.
ఒక్క తప్పుడు పార్కింగ్ వల్ల… ఒక కుటుంబంలో తీరని విషాదానికి కారణం కావచ్చు.
“రహదారి భద్రత అందరి బాధ్యత – బాధ్యతగా పార్కింగ్ చేసి ప్రాణాలను కాపాడుకుందాం.”
కర్నూలు క్రైమ్, జూలై 24, (సీమకిరణం న్యూస్):

కర్నూలు నగరంలోని గురు రాఘవేంద్ర నగర్ చౌరస్తా ఫ్లైఓవర్ వద్ద జాతీయ రహదారిపై భారీ వాహనాలను అక్రమంగా పార్క్ చేయడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చెన్నమ్మ సర్కిల్ సర్వీస్ రోడ్డు నుంచి జాతీయ రహదారి పైకి వచ్చే వాహనాలకు పార్క్ చేసిన లారీలు, ట్రక్కులు అడ్డుగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనం క్రేన్‌ను ఢీకొన్న ఘటన మరోసారి ఈ సమస్య తీవ్రతను బయటపెట్టింది. రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో జాతీయ రహదారిపైనే వాహనాలను నిలిపివేయడం వల్ల ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని వాహనదారులు చెబుతున్నారు. స్థానికులు, ప్రయాణికులు జాతీయ రహదారిపై అక్రమ పార్కింగ్‌ను వెంటనే నివారించేందుకు పోలీసులు, జాతీయ రహదారుల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.