seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 8:29 am Digital Edition : SEEMA KIRANAM

టాలీవుడ్ యూనియన్ వార్‌కు బాలయ్య ఫుల్‌స్టాప్

టాలీవుడ్ యూనియన్ వార్‌కు బాలయ్య ఫుల్‌స్టాప్..

 

రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించిన బాలకృష్ణ..!

 

హైదరాబాద్, జూలై 20, (సీమకిరణం న్యూస్):

 

టాలీవుడ్‌లో ఇటీవల డాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు సద్దు మణిగినట్లు నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ వెల్లడించారు. పరిశ్రమలోని సంఘాల మధ్య ఏర్పడిన చిన్న చిన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించామని ఆయన తెలిపారు. ఈ వివాదం పరిష్కారంలో నటుడు నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర పోషించినట్లు ప్రసన్నకుమార్ చెప్పారు. కాకినాడలో ఉన్న బాలకృష్ణ స్వయంగా ఫోన్ చేసి, సినిమా పరిశ్రమలో ఇలాంటి విభేదాల వాతావరణం కొనసాగకూడదని సూచించినట్లు పేర్కొన్నారు. సమస్యను త్వరగా పరిష్కరించి, అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని బాలయ్య కోరినట్లు తెలిపారు. బాలకృష్ణ సూచనలతో పరిశ్రమ పెద్దలు, నిర్మాతల మండలి సభ్యులు, సంబంధిత సంఘాల ప్రతినిధులు సమావేశమై చర్చలు జరిపారు. డాన్సర్స్ అసోసియేషన్‌లోని ఇరువర్గాలు సామరస్యంగా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో కొంతకాలంగా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన యూనియన్ వివాదానికి ముగింపు లభించినట్లయింది. సినిమా పరిశ్రమలో ఐక్యత, పరస్పర సహకారం అవసరమని.. కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి పనిచేసినప్పుడే పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.