seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 4:08 pm Digital Edition : SEEMA KIRANAM

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి 

 

డిప్యూటీ ఎంపీడీవో రవి కిషోర్ 

 

రైతుల అభివృద్ధికి సొసైటీ ఎల్లప్పుడూ తోడ్పాటునిస్తుంది 

 

సొసైటీ చైర్మన్ రమాకాంత్ రెడ్డి

 

వెల్దుర్తి, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్ ) :

 

వెల్దుర్తి మండల ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ లక్ష్మీ దేవమ్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సొసైటీ చైర్మన్ రమాకాంత్ రెడ్డి, జడ్పిటిసి సుంకన్న, డిప్యూటీ ఎంపీడీవో రవి కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండలంలో పెరుగుతున్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలపై కూడా చర్చ జరిగింది. గ్రామాల్లో పలుచోట్ల కరెంటు స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా మారినాయని, వాటిని వెంటనే మార్చాలని సభ్యులు కోరారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమస్యలు, పరిష్కార మార్గాలపై వివరించారు. సొసైటీ చైర్మన్ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు అవసరమైన వ్యవసాయ మందులు సొసైటీలో అందుబాటులో ఉన్నాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల అభివృద్ధికి సొసైటీ ఎల్లప్పుడూ తోడ్పాటునిస్తుందని తెలిపారు. అంగన్వాడీ సూపర్వైజర్లు మాట్లాడుతూ, గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించాలని సర్పంచులను కోరారు. చిన్నారుల సంక్షేమం కోసం అంగన్వాడీ కేంద్రాలు కీలకమని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి అక్బర్ బాషా, ఏపీఓ లక్ష్మన్నతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.