seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 12:49 pm Digital Edition : SEEMA KIRANAM

గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ మోసాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ 

కర్నూలు క్రైమ్, మార్చి 11, (సీమకిరణం న్యూస్):

ప్రస్తుతం చోటు చేసుకుంటున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత ను ఆసరాగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు ప్రజలను భయపెట్టి గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందని వెంటనే బుకింగ్ చేయాలి, ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి వంటి తప్పుడు సందేశాలు పంపిస్తూ సైబర్ మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్  బుధవారం తెలిపారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు లేదా నకిలీ లింక్‌ల ద్వారా గ్యాస్ సబ్సిడీ, గ్యాస్ బుకింగ్ ప్రత్యేక డిస్కౌంట్ ల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతాయన్నారు. ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం అధికారిక గ్యాస్ ఏజెన్సీ యాప్‌లు లేదా అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలి. తెలియని వ్యక్తులు పంపే లింక్‌లపై క్లిక్ చేయకూడదు. ఫోన్ ద్వారా అడిగినా OTP, బ్యాంక్ వివరాలు, UPI పిన్ వంటి గోప్యమైన సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ఆఫర్లు, తప్పుడు ప్రచారాలను నమ్మకూడదు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in⁠ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్  సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి , సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్  కోరారు.