seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 3:29 pm Digital Edition : SEEMA KIRANAM

గ్యాస్ సరఫరాపై వ్యాప్తి చెందుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు

సామాజిక మాధ్యమాల్లో గ్యాస్ సరఫరాపై వ్యాప్తి చెందుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు

 

జిల్లా జాయింట్ కలెక్టర్ డా.నిధిమీనా

 

కడప, మార్చి 16, (సీమకిరణం న్యూస్) :

సామాజిక మాధ్యమాల్లో గ్యాస్ సరఫరాపై వ్యాప్తి చెందుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధిమీనా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో జిల్లా జాయింట్ కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని,ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని 58 గ్యాస్ ఏజెన్సీ లకు ప్రత్యేక అధికారులను నియమించి, జిల్లా మరియు డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎల్‌పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, గృహ అవసరాలకు గ్యాస్ కొరత ఉండదని స్పష్టం చేశారు. గ్యాస్ బుకింగ్‌ను పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు పూర్తైన తర్వాత మాత్రమే చేసుకోవాలని సూచించారు. అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయరాదని తెలిపారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే నిత్యావసరాల చట్టం – 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు.