seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 11:32 am Digital Edition : SEEMA KIRANAM

గూడూరు, జులకల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కర్నూలు ఎస్పీ

 

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి

 

పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు

 

కర్నూలు క్రైమ్, అక్టోబర్ 16 (సీమకిరణం న్యూస్):

 

ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడూరు, జులకల్ గ్రామాల్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 

 

ఓటర్లకు భద్రత కల్పించాలి…

 

 

గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు, ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడే అవకాశం ఉన్నవారిపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్పీ సూచించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు తగిన భద్రత కల్పించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కోడుమూరు సీఐ తబ్రేజ్, గూడూరు ఎస్‌ఐ రాజా కుళాయప్ప, సి. బెళగల్ ఎస్‌ఐ వేణుగోపాల రాజు తదితరులు పాల్గొన్నారు.