seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 1:48 pm Digital Edition : SEEMA KIRANAM

కోవా బన్ – కంటతడి – సమాధానం లేని ప్రశ్నలు

**కోవా బన్ – కంటతడి – సమాధానం లేని ప్రశ్నలు**

అతని చూపులో అసహాయత, వ్యాపారం పోతుందేమోనని భయం, పదిమంది చుట్టు ముట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటే స్పందించలేని అమాయకత్వం, కళ్ళ గుడ్లలో నీళ్లు బయటికి రాకుండా ఆ బన్ను తింటున్న దృశ్యం నెటిజన్ లను వెంటాడుతుంది..

అతను ఏడవకుండానే కళ్ళలో నీళ్లు బయటకు రాకుండానే ఎంతోమంది నెటిజనుల కళ్ళల్లో నీళ్లు తెప్పించాడు.. ఈ మధ్యకాలంలో ఈ విధంగా సామాన్య ప్రజలు విరుచుకు పడడం మొదటి సారి చూస్తున్నాము..

మేడారం జాతరలో పది రూపాయలకే కోవాబన్ ఎలా అమ్ముతున్నావు? లీటర్ పాలు 80 రూపాయలు అయితే అని ప్రశ్న.. బజారులో బన్ను కొనుక్కొని ఇంటి దగ్గర కోవా చేసుకుని మేము వ్యాపారం చేసుకుంటాము బ్రతకడానికి ఇక్కడికి వచ్చాము అని అతని సమాధానం..

ఎంతోమంది పిల్లలు తింటారు వాళ్ళని చంపడానికే ఇక్కడికి వచ్చావా? మీ పిల్లలకు పెడతావా? అని శరసంధానం..

మా పిల్లలకు కూడా పెడతాను మేడం మేము ఇక్కడికి బ్రతకడానికి వచ్చాము.. అయితే నీ ఆధార్ కార్డు చూపించు.. చెట్టుకు కట్టేయండి.. పోలీసులను పిలవండి.. అంటూ తలో మాటతో గందరగోళం…

అనూహ్యమైన పరిమాణానికి భయపడి పోయిన ఓ సాధారణ కోవా బన్ను వ్యాపారి.. ఇంతలో నువ్వు తింటావా ఏమన్నా అని ప్రశ్న? నేను కూడా అప్పుడప్పుడు తింటాను మేడం అని సమాధానం.. అప్పుడప్పుడు కాదు అని గద్దింపు..

వెంటనే దానికి సమాధానంగా ఓ బన్ను తీసుకొని గుడ్లలో నీళ్లు కుక్కుకొని తినడం మొదలుపెట్టాడు.. అంతటితో ఆగకుండా ఎందుకు గాభర పడుతున్నావు అని మరల ప్రశ్న.. ఇక దానికి అతను సమాధానం ఇవ్వలేదు అతని కళ్ళే అతని సమాధానం .. అతని నిర్దోషిస్తానికి రుజువు..

ఆ కళ్ళలో సమాజాన్ని ప్రశ్నిస్తున్న అనేక ప్రశ్నలు? రోజుకు కేజీ కోవా బన్ను 50 అమ్మితే అతనికి వచ్చేది 500 అందులో లాభం 100 రూపాయలు.. ఓ 10 కేజీలు అమ్మితే వెయ్యి రూపాయలు పొద్దున నుంచి సాయంత్రం వరకు సంపాదిస్తాడు.. అలా పది రోజులు జాతరలో కష్టపడితే ఓ పదివేలు సంపాదించవచ్చు..

దానికోసం రేయి పగలు కష్టపడాలి అంతేకాకుండా దానికోసం ఇంటికాడ ఎన్నో సమస్యలతో ఎదురుచూస్తున్న భార్యా పిల్లలు.. ఎలాగోలాగా వ్యాపారం చేస్తూ భవసాగరాన్ని ఈదాల్సిందే కదా?.. ఆకలి చాలా చెడ్డది.. ఇలాంటి నిస్సహాయతలోనించే మనుషులలో తెగింపు వస్తుంది.. ఇలా కష్ఠపడి కూడా బ్రతకనీయకుంటే తెగిస్తారు..

ఆ చిరు వ్యాపారి కళ్ళలో ప్రశ్నించిన ప్రశ్నకు నెటిజనులు భగ్గుమన్నారు.. ఇంకా మనుషులలో మానవత్వం ఉంది పేదవాని వైపే ప్రజలు ఉన్నారు అని నిరూపించారు.. అతడి కళ్ళలో కన్నీటి చుక్కలు బయటికి రాలేదు కానీ నెటిజన్ల కళ్ళలో ఇంకా కన్నీటి చుక్కలు ఉన్నాయి అవి ఇంకి పోలేదు అప్పుడప్పుడు బయటికి వస్తాయి.. అని నిరూపించాయి..

ఇంతకు అతను చేసిన తప్పేంటి?

పది రూపాయలకే కోవా బన్ను అమ్మడమా?

అంతకుమించి అతని పేరు… వలి…అనా?

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

కర్నూలు