కసాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ట్రాక్టర్ ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి.. డ్రైవర్ పరారీ
కర్నూలు క్రైమ్/వెల్దుర్తి, జూలై 06,(సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కసాపురం సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గుర్తు తెలియని ట్రాక్టర్ టూ వీలర్‌ను ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చర్ల కొత్తూరు గ్రామానికి చెందిన చంద్రమోహన్ సోలార్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం బొమ్మిరెడ్డిపల్లెకు పనిమీద వెళ్లిన ఆయన, పని ముగించుకుని మధ్యాహ్నం సుమారు 2 గంటలకు టూ వీలర్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా కసాపురం వద్ద ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని ట్రాక్టర్ అతని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన చంద్రమోహన్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. మృతుడి తల్లి లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చంద్రమోహన్ అకాల మరణంతో చర్ల కొత్తూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.