న్యూ ఈద్గా వద్ద 3,500 మందికి పైగా ముస్లిం సోదరుల ప్రార్థనలు
కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 19, (సీమకిరణం న్యూస్):
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ కర్నూలు పట్టణానికి చెందిన ముస్లిం సోదరులు శనివారం ఉదయం సంతోష్ నగర్‌లోని న్యూ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 7:45 గంటల వరకు ‘నమాజ్-ఎ-ఇస్తిస్ఖా’ (Namaz-e-Istisqa) ప్రత్యేక నమాజ్ నిర్వహించి, వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని అల్లాహ్‌ను ప్రార్థించారు. ఈ ప్రత్యేక ప్రార్థనలో కర్నూలు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 3,500 మందికి పైగా ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈద్గా ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. అదేవిధంగా ఆదివారం, సోమవారం కూడా ఉదయం న్యూ ఈద్గా వద్ద ‘నమాజ్-ఎ-ఇస్తిస్ఖా’ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్షాల కోసం ప్రార్థించాలని వారు కోరారు.