seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 1:22 pm Digital Edition : SEEMA KIRANAM

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం…గర్భిణి దుర్మరణం

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం

 

ఆర్టీసీ బస్సు కింద పడి ఐదు నెలల గర్భిణి దుర్మరణం

 

 – తండ్రికి తీవ్ర గాయాలు

 

కర్నూలు  క్రైమ్, జూలై 18, (సీమకిరణం న్యూస్) :

కాన్పు కోసం పుట్టింటికి వెళ్తున్న ఐదు నెలల గర్భిణి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషాద ఘటన శనివారం కర్నూలు నగర సమీపంలోని పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా గడివేముల మండలానికి చెందిన ప్రియాంకను తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మద్దూరు గ్రామానికి చెందిన బజారికి వివాహం చేశారు. ప్రస్తుతం ప్రియాంక ఐదు నెలల గర్భిణి కావడంతో కాన్పు కోసం పుట్టింటికి తీసుకెళ్లేందుకు ఆమె తండ్రి రాముడు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నారు. పంచలింగాల చెక్‌పోస్ట్ సమీపానికి చేరుకోగానే బైక్ అదుపుతప్పి ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కిందపడిన ప్రియాంకపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి రాముడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి రాముడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కాన్పు కోసం పుట్టింటికి వస్తున్న కూతురు కళ్లముందే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.