కర్నూలులో ఉచిత మిలిటరీ కాలిస్థెనిక్స్ వర్కౌట్ కార్యక్రమం
ప్రత్యేక అతిథిగా షేక్ సమీర్ అహ్మద్ హాజరు
అక్టోబర్ 25న ఎస్‌టిబీసీ మైదానంలో నిర్వహణ
కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 23 (సీమకిరణం న్యూస్):
కర్నూలు నగరంలో ప్రజలకు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక స్థైర్యంపై అవగాహన కల్పించేందుకు ది హ్యూమానిటీ ఫస్ట్ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన ఉచిత మిలిటరీ కాలిస్థెనిక్స్ వర్కౌట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కువైట్‌లో మెడికల్ టెక్నాలజిస్ట్‌గా పనిచేస్తున్న షేక్ సమీర్ అహ్మద్ హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు కర్నూలులోని ఎస్‌టిబీసీ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. యువతతో పాటు ప్రజల్లో వ్యాయామంపై ఆసక్తిని పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. మిలిటరీ తరహా శరీర బరువుతో చేసే వ్యాయామాల ద్వారా శక్తి, సహనశక్తి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. 50 సంవత్సరాల లోపు వయస్సు గల ప్రజలు, యువత, ఫిట్‌నెస్ ప్రియులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు. పాల్గొనేవారు జాగింగ్‌కు అనువైన సౌకర్యవంతమైన క్రీడా దుస్తులు ధరించి రావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ది హ్యూమానిటీ ఫస్ట్ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పఠాన్ వహీద్ ఉల్లా ఖాన్ కోరారు.