కర్నూలులో అసాంఘిక కార్యకలాపాల నిర్వాహకురాలు పూల లక్ష్మి అరెస్ట్!
కర్నూలు క్రైమ్, జూలై 18, (సీమకిరణం న్యూస్) :
నగరంలోని ముజఫర్ నగర్ ప్రాంతంలో కలకలం రేపిన అసాంఘిక కార్యకలాపాల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్న పూల లక్ష్మిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం… గత వారం ముజఫర్ నగర్ పరిధిలోని ఒక ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయన్న నమ్మదగిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో వ్యభిచార గృహంలో పట్టుబడిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు.
అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా…
ఈ కేసుపై పోలీసులు జరిపిన లోతైన దర్యాప్తులో పూల లక్ష్మి ప్రధాన సూత్రధారి అని తేలింది. ఆమె ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, గుట్టుచప్పుడు కాకుండా ఈ అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తగిన ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది.
వాట్సాప్ చాటింగులపై పోలీసుల కన్ను:
నిందితురాలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆమె వాట్సాప్ చాటింగులపై ప్రత్యేక దృష్టి సారించారు. పూల లక్ష్మితో నిరంతరం చాటింగ్ చేస్తూ, ఈ వ్యభిచార కూపంతో సంబంధాలు కలిగి ఉన్న విటులు, ఇతర మధ్యవర్తుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో త్వరలోనే మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో ఇటువంటి అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించారు.