seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 3:46 pm Digital Edition : SEEMA KIRANAM

కర్నూలులో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దాడి

ఆరుగురు అరెస్ట్.. 

 

అదుపులోకి ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులు 

 

 

కర్నూలు క్రైమ్, జులై 10 (సీమకిరణం న్యూస్):

 

కర్నూలు నగరంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దాడి నిర్వహించారు. కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజఫర్‌నగర్, ఆదిత్యనగర్ ప్రాంతాల్లోని ఓ ఇంటిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక పెద్దల సమక్షంలో నిర్వహించిన తనిఖీల్లో ఆ ఇంటిలో పలువురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో అద్దెకు తీసుకున్న ఇంటిలో గుట్టుచప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కార్యకలాపాలకు మరికొందరు సహకరిస్తూ, పరిచయస్తుల ద్వారా వ్యక్తులను అక్కడికి రప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలతో పాటు ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కర్నూలు బీ. తాండ్రపాడుకు చెందిన మహేశ్వర్, టీ. గోగులపాడుకు చెందిన ఖలీల్, ఒంగోలుకు చెందిన వెంకటేశ్వర్లు ఉన్నారు. మొత్తం ఆరుగురిపై అనైతిక రవాణా (నివారణ) చట్టం (పి ఐ టి ఏ) కింద కేసు నమోదు చేసి, రిమాండ్ నిమిత్తం గౌరవ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విక్రమ్ సింహా తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద లేదా అసాంఘిక కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.