వెల్దుర్తిలో ఉత్సాహంగా జడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికల పోలింగ్…
ఓటు హక్కు వినియోగించుకున్న జడ్పీటీసి అభ్యర్థి శైలజ సుబ్బారాయుడు
వెల్దుర్తి నజీర్, నవంబర్ 5 (సీమకిరణం న్యూస్):
వెల్దుర్తి మండలంలో జడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో జడ్పీటీసి అభ్యర్థి ఎం. శైలజ సుబ్బరాయుడు తన ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకున్నారు. గురువారం ఉదయం బొమ్మిరెడ్డి పల్లె గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె, క్యూలైన్లో నిలబడి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను చాటుతూ తన ఓటును వేశారు. అదేవిధంగా ఆమె భర్త, ప్రముఖ టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన అభ్యర్థులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, పలువురు అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలింగ్ సరళిని పరిశీలించారు. గ్రామంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.