ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువు పొడిగింపు
సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తులకు అవకాశం
కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు వెల్లడి
కల్లూరు, సెప్టెంబర్ 02, (సీమకిరణం న్యూస్):
138-పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ -2026 ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం గడువును పొడిగించినట్లు కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు. 01-07-2026 అర్హత తేదీ ఆధారంగా ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, ఓటరు జాబితాలోని తప్పులు, మార్పులు, చేర్పులను నిర్ణీత గడువులోగా సరిచేసుకోవాలని ఆయన సూచించారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..కార్యక్రమం గడువు,
1) అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ
31-07-2026 నుండి 10-09-2026 వరకు.
2) అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారం
31-07-2026 నుండి 05-10-2026 వరకు.
3)తుది ఓటరు జాబితా ప్రచురణ
09-10-2026.
పేర్లు లేనివారు వెంటనే నమోదు చేసుకోవాలి.
ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని వారు, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ ఆంజనేయులు కోరారు. ఓటరు వివరాల్లో పేరు, వయస్సు, చిరునామా తదితర అంశాల్లో తప్పులు ఉన్నట్లయితే సవరణ చేసుకునేందుకు కూడా అవకాశం ఉందన్నారు. చిరునామా మార్పులు, ఇతర వివరాల సవరణల కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. స్థానిక బి ఎల్ ఓ, ఏ ఈ ఆర్ ఓ, లేదా ఈ ఆర్ ఓ కార్యాలయాలను సంప్రదించి సెప్టెంబర్ 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
అర్హులంతా ఓటర్లుగా నమోదు కావాలి
18 సంవత్సరాలు నిండిన అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవడం తమ బాధ్యతగా భావించాలని తహసీల్దార్ ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకమని, ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దని పేర్కొన్నారు. సెప్టెంబర్ 10 వరకు పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు.