seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 3:37 pm Digital Edition : SEEMA KIRANAM

ఓటరు జాబితా ప్రక్షాళనపై అప్రమత్తంగా ఉండాలి 

ప్రతి ఓటునూ జాగ్రత్తగా పరిశీలించాలి

 

 పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

 

 

వెల్దుర్తి, జూన్ 02 (సీమకిరణం న్యూస్):

ఓటరు జాబితా ప్రక్షాళనపై అప్రమత్తంగా ఉండాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ తెలిపారు. మంగళవారం వెల్దుర్తిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మండలానికి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో జరుగుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ) కార్యక్రమాన్ని అత్యంత కీలకంగా తీసుకోవాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ నాయకులు పూర్తి అప్రమత్తతతో పనిచేయకపోతే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు భారీగా తొలగిపోయే ప్రమాదం ఉందని వారు తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమం పేరుతో గ్రామాలు, పట్టణ వార్డుల్లో నెల రోజులపాటు ప్రక్రియ జరుగుతుందని, ఈ కీలక దశలో చిన్న నిర్లక్ష్యం జరిగినా పెద్ద నష్టం తప్పదని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల్లో జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపుతూ, ప్రతి ఓటుపైనా ప్రత్యేక నిఘా అవసరమని పేర్కొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా, నిరంతరంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించడం, తటస్థ ఓటర్లతో పాటు పార్టీ మద్దతుదారుల వివరాలను కచ్చితంగా నమోదు చేసుకోవాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సర్వేను పర్యవేక్షించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఓటరు తొలగింపునకు సంబంధించిన ప్రతి క్లెయిమ్‌ను ఏమాత్రం అలసత్వం లేకుండా పరిశీలించాలన్నారు. అర్హులైన ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత బూత్ లెవల్ ఏజెంట్లదేనని, చిన్న పొరపాటు కూడా పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ఈ అంశాన్ని అందరూ “యుద్ధ ప్రాతిపదికన” తీసుకుని పనిచేయాలని శ్రీదేవమ్మ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి దేశాయి సమీర్ కుమార్ రెడ్డి, ఆర్టీఏ విభాగం రాష్ట్ర కార్యదర్శి కొత్తూరు వెంకటేష్ రెడ్డి, వైఎస్సార్ యూత్ విభాగం పత్తికొండ నియోజకవర్గం అధ్యక్షుడు నర్సింగ్ అశోక్ కుమార్ రెడ్డి, ముస్లిం మైనార్టీ మండల కన్వీనర్ గట్టు ఆరిఫ్, పుల్లగుమ్మి నాగార్జున రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, మాధవస్వామి, సుద్దపల్లె వెంకటేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.