ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
దేశంలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. దీనితో ప్రజలు గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా, ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
గ్యాస్ సిలిండర్ల కొరతతో భారీగా ఇండక్షన్ స్టవ్ ల కొనుగోలు
దీంతో ఇండక్షన్ స్టవ్ ల కొనుగోలు భారీగా పెరిగినట్లు ఈ-కామర్స్ సంస్థలు వెల్లడించాయి. సాధారణంగా నెలకు సుమారు 1.80 లక్షల ఇండక్షన్ స్టవ్‌లు మాత్రమే అమ్ముడవుతుండగా, తాజాగా ఒకే రోజు 1.34 లక్షలకు పైగా ఇండక్షన్ స్టవ్‌లు విక్రయిస్తున్నారు. ఈ అనూహ్య డిమాండ్ మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది పెరుగుతున్న గ్యాస్ కొరతను స్పష్టం చేస్తుంది.

విద్యుత్ ఇబ్బంది లేకపోవటంతో ఇండక్షన్ స్టవ్ ల కొనుగోళ్ళు
వంటగ్యాస్ సరఫరాలో ఆలస్యం, కొన్ని ప్రాంతాల్లో సిలిండర్ కొరత వంటి సమస్యలు ఎదురవుతున్నాయి చాలా మంది గృహిణులు, చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఇండక్షన్ స్టవ్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా నగరాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉండటంతో ఇండక్షన్ స్టవ్స్ వాడకం వేగంగా పెరుగుతోంది.
ఈ కామర్స్ సైట్లలో ఇండక్షన్ స్టవ్స్‌కు భారీ డిమాండ్
ఈ-కామర్స్ సైట్లలో కూడా ఇండక్షన్ స్టవ్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్‌లో ఒక్క రోజులోనే 1.34 లక్షలకు పైగా ఇండక్షన్ స్టవ్స్ అమ్ముడైనట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. సాధారణంగా నెల రోజులలో జరిగే అమ్మకాలు, ఒకే రోజులో తాజా పరిస్థితికి అద్దం పడుతుంది.ఊహించని విధంగా ఈ ఆకస్మిక డిమాండ్ కారణంగా చోట్ల స్టవ్స్ నిల్వలు పూర్తిగా అయిపోయాయి.
ఇండక్షన్ స్టవ్ లౌట్ ఆఫ్ స్టాక్ బోర్డులు
ఫలితంగా కొంతమంది వ్యాపారులు ఇండక్షన్ స్టవ్స్ “అవుట్ ఆఫ్ స్టాక్” బోర్డులు పెడుతున్నారు. మార్కెట్ నిపుణుల ప్రకారం గ్యాస్ సరఫరా సమస్యలు కొనసాగితే ఇండక్షన్ స్టవ్స్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇండక్షన్ స్టవ్స్ వినియోగం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తక్కువ సమయంలో వంట పూర్తవడం, వంట చేసే సమయంలో భద్రత వంటి అనేక సౌలభ్యాలు ఇండక్షన్ స్టవ్స్ తో దొరుకుతాయి.

