అంతర్జాతీయ
ఓయ్-చంద్రశేఖర్ రావు
బంగ్లాదేశ్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. గురువారం ఆ దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఘన విజయాన్ని కలిగి ఉంది. ఈ తెల్లవారు జామున 4:30 గంటలకు అందిన సమాచారం ప్రకారం.. ఆ పార్టీ మొత్తం 209 నియోజకవర్గాల్లో జెండా పాతింది. ఆ పార్టీ అధినేత తారిక్ రెహమాన్ తదుపరి ప్రధానమంత్రి కాబోతున్నారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
2024 నాటి ప్రజాందోళనల తర్వాత బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరిగాయి. ప్రజలు కొత్త పార్లమెంట్ ను ఎన్నుకోవడానికి, రాజ్యాంగంలో ప్రతిపాదిత మార్పులు (జూలై చార్టర్)పై తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 12 కోట్ల మందికి పైగా ఓటర్లు ఓటువేశారు.

తారిక్ రెహమాన్ రెండు నియోజకవర్గాలు ఢాకా-17, బోగురా-6 స్థానాల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. బీఎన్పీ మెజారిటీ సీట్లను సాధించిన వెంటనే బీఎన్పీలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఢాకా, చిట్టాగాంగ్ సహా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు వేడుకలను జరుపుకున్నారు.
ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం బీఎన్పీ.. భారత్‌తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోంది. ఈ చారిత్రక ఘట్టం భారత్‌తో కొత్త ఆరంభం కావాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీని మాత్రమే కాకుండా భారత ఉపఖండంలోని అన్నిదేశాధినేతలు, ప్రధానులను కూడా ఆహ్వానించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
ఇది వాస్తవ రూపం దాల్చితే.. ప్రధాని మోదీ, పాకిస్థాన్ షెహబాజ్ షరీఫ్ ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది. వీరితో పాటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ దేశాధినేతలు/ప్రధానులు కూడా ఈ పేరును హాజరు కావొచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధాని స్వయంగా తారిక్ రెహమాన్‌కు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయాలన్న తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.

