ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
బీహార్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ అరెస్ట్ విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏ మాత్రం ఊహించని విధంగా ఏకంగా బీహార్ ప్రభుత్వమే రంగంలోకి దిగింది. తొలుత ఏపీ పోలీసులకు ట్రాన్సిట్ రిమాండ్ ఇవ్వడానికి పాట్నా కోర్టు నిరాకరించిన అనంతరం ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సునీల్ నాయక్ కు భారతీయ న్యాయ సంహిత కింద రక్షణ కల్పించింది.
ఈ మేరకు బీహార్ హోం మంత్రిత్వ శాఖ జైంట్ సెక్రెటరీ అమలేందు కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఒక్క సునీల్ నాయక్ వరకు మాత్రమే పరిమితం కావట్లేదు. రాష్ట్రంలో పని చేసే పోలీసులందరికీ కూడా వర్తిస్తుంది. తమ రాష్ట్రంలో విధి నిర్వహణలో ఉన్న ఐపీఎస్ అధికారులు, పోలీసులపై ఇతర రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలంటే ఇకపై బిహార్ ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

బీఎన్ఎస్ లోని సెక్షన్ 218 కింద రాష్ట్ర పోలీసులకు ఈ రక్షణ కల్పించింది బీహార్ ప్రభుత్వం. ఏ పోలీసు అధికారిపైనా కేసు నమోదు చేయాలన్నా, కోర్టు విచారణ చేపట్టాలన్నా వాటికి సంబంధించిన సమగ్ర వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. అవి సంతృప్తికరంగా ఉంటేనే తదుపరి చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా తప్పనిసరి చేసింది. సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర బలగాలకు ఉన్న రక్షణను రాష్ట్ర పోలీసులకు కూడా వర్తింపజేసింది.
మొదట్లో ఏపీ పోలీసులకు సునీల్ నాయక్ ట్రాన్సిట్ రిమాండ్ ఇవ్వడానికి పాట్నా కోర్టు నిసరైన పత్రాలు లేకపోవడం, ప్రక్రియలో లోపాలను కారణంగా చూపుతూ ఆయనను విడుదల చేయడం జరిగింది. 2024లో ఏపీలో దాఖలైన ఓ ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు ఉండటం వల్ల ఆయన అరెస్టుకు కారణమైంది. 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్. ఏపీలో ఇంటర్ కేడర్ డెప్యుటేషన్‌పై పనిచేశారు. ప్రస్తుతం ఆయన పాట్నాలో బీహార్ ఫైర్ అండ్ హోం గార్డ్స్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
2021లో తనను అరెస్ట్ చేసి, కస్టడీలో హింసించారని, హత్యాయత్నం చేశారని, అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు, ఇప్పటి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వారిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 307 కింద సునీల్ నాయక్ సహా మరికొందరు పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అనంతరం సునీల్ నాయక్ తన మాతృ రాష్ట్రానికి తిరిగివెళ్లారు.

