అంతర్జాతీయ
-కొరివి జయకుమార్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏడాదికి అడుగుపెట్టింది. 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ సుదీర్ఘ పోరు రెండు దేశాల మధ్య తీవ్రమైన నష్టాలను మిగిల్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకారం ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం “ప్రత్యేక సైనిక ఆపరేషన్” పేరుతో పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించింది.
నిజానికి ఇది ఒక పూర్తి స్థాయి యుద్ధంగా మారి, అంతం లేని పోరాటంగా కొనసాగుతోంది. ఈ యుద్ధం వలన ఇరు దేశాలు అపారంగా దెబ్బతిన్నాయి. ఈ నాలుగు సంవత్సరాల్లో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ఉక్రెయిన్ మౌలిక వసతులు భారీగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం కూడా యుద్ధం ముగిసే సంకేతాలు కనిపించడం లేదు.

నాటో (ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంఘం)లో ఉక్రెయిన్ చేరాలని ప్రయత్నించిందని రష్యా ఆరోపించడమే ఈ యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఉక్రెయిన్‌ను తన ప్రభావ పరిధిలో ఉంచుకోవాలనేది రష్యా ముఖ్య లక్ష్యం. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. డోన్‌బాస్ ప్రాంతంలోని స్వయంప్రకటిత వేర్పాటువాదులకు మద్దతునిచ్చింది. ఉక్రెయిన్ “ఒక దేశంగా లేదని”, అది రష్యా చరిత్రలో భాగమని పుతిన్ వాదించారు.
2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ సరిహద్దుల నుండి రష్యా బహుముఖ దాడులు చేసింది. కీవ్‌ను త్వరగా వశం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ రోజుల్లో రష్యా సైన్యం వేగంగా ముందుకు సాగింది. అయితే, ఉక్రెయిన్ సైన్యం మరియు ప్రజల ప్రతిఘటన కారణంగా కీవ్‌ను ఆక్రమించే ప్రయత్నం విఫలమైంది. ఉత్తరం నుండి వెనక్కి తగ్గిన రష్యా, ఆ తర్వాత డాన్‌బాస్ (డోనెట్స్క్, లుహాన్స్క్) మరియు దక్షిణం (ఖెర్సన్, జపోరిజ్జియా) ప్రాంతాలపై దృష్టి సారించాయి.
ఈ యుద్ధంలో కొన్ని ముఖ్య సంఘటనలు నమోదయ్యాయి. 2022 మార్చి-ఏప్రిల్‌లో బుచా, మారియుపోల్ వంటి ప్రాంతాల్లో సామూహిక హత్యలు, యుద్ధ నేరాల ఆరోపణలు వెల్లువెత్తాయి. 2022 సెప్టెంబర్‌లో ఉక్రెయిన్ ఖార్కివ్ ప్రాంతంలో భారీ ఎదురుదాడి చేసి వేలాది చదరపు భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. 2023లో ఉక్రెయిన్ పెద్ద ఎత్తున ఎదురుదాడి చేసినప్పటికీ విజయాన్ని సాధించలేకపోయింది.
2024లో రష్యా డాన్‌బాస్‌లోని ఆవడివ్కా వద్ద నెమ్మదిగా ముందుకు సాగింది, అదే సమయంలో ఉక్రెయిన్ రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోకి ప్రవేశించింది. 2025-2026 నాటికి రష్యా కొన్ని ప్రాంతాలను నెమ్మదిగా స్వాధీనం చేసుకుంది, అయితే భారీ నష్టాలను చవిచూసింది. ఈ కాలంలో ఉక్రెయిన్ డ్రోన్లు, సుదూర దాడులతో ప్రతిఘటించారు.
ఇటీవల, 2026 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ కొన్ని కీలక ప్రాంతాలైన కుప్యాన్స్క్, జపోరిజ్జియా, డ్నిప్రోపెట్రోవ్స్క్‌లలో సుమారు 150-200 చదరపు భూభాగాన్ని ఎదురుదాడి చేసి తిరుగు స్వాధీనం చేసుకుంది. ఈ విజయం రష్యాకు సవాలుగా మారింది. యుద్ధం ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టాడు, ఫ్రంట్‌లైన్ ఎక్కువగా స్థిరంగా (నిశ్చలంగా) ఉంది. రష్యా డ్రోన్‌లు, క్షిపణులతో ఉక్రెయిన్ ఇంధన సౌకర్యాలు, నగరాలపై దాడులు కొనసాగుతున్నాయి. దీనికి ప్రతిగా ఉక్రెయిన్ రష్యన్ ఆయుధ డిపోలు, కమాండ్ పోస్టులు, చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు జరుగుతున్నాయి.
ఈ యుద్ధం వలన అపారమైన నష్టాలు సంభవించాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం, ఉక్రెయిన్ పౌరులు 15,000 మందికి పైగా మరణించారు, 41,000 మందికి పైగా గాయపడ్డారు. సైనిక నష్టాలు రెండు వైపులా లక్షల్లో (రష్య వైపు ఎక్కువ) ఉన్నాయి. ఆర్థికంగా, ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థ దెబ్బతింది, రష్యా చమురు-గ్యాస్ ఎగుమతులు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం, ద్రవ్యోల్బణం, యూరప్‌లో ఇంధన సమస్యలు తలెత్తాయి.

