ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
ఏపీ ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంది. అసెంబ్లీలో రేపు (శనివారం) ఉదయం 11.15 గంటలకు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. కాగా, ఈసారి బడ్జెట్ అభివృద్ధి.. సంక్షేమానికి పెద్ద పీట వేయనున్నారు. దాదాపు రూ 3.45 నుంచి 3.50 లక్షల కోట్ల వరకు అంచనాలు ఉండే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో ప్రధాన హామీ అమలు దిశగా ఈ బడ్జెట్ లో ప్రకటన ఉండాల్సిన సమాచారం.
ఏపీ అసెంబ్లీలో 14వ తేదీ ఉదయం 11.15కి ఏపీ బడ్జెట్ 2026- 27 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. ఆ తరువాత వ్యవసాయ శాఖ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందు ఉంచనున్నారు. ఈ సారి ప్రత్యేకంగా ఇరిగేషన్ బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. దాదాపు రూ 3.50 లక్షల కోట్ల వరకు అంచనాలుగా ఉండే అవకాశం ఉంది. అభివృద్ధి – సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే నాలుగు అమలు చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు నూ 1500 పథకం పైన బడ్జెట్లో ప్రకటన చేస్తారని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ప్రాధాన్యత రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ తరువాత రాష్ట్రానికి కేంద్రం నుంచి పన్నుల వాట.. వివిధ రంగాల్లో వచ్చే నిధుల పైన స్పష్టత రావటంతో.. ఏపీ ప్రభుత్వం ఈ లెక్కల ఆధారంగా బడ్జెట్ కు తుది రూపు ఇస్తోంది.

ప్రాధాన్యతా రంగాలకు అధిక కేటాయింపులు
కాగా.. సంక్షేమం, అభివృద్ధికి సమపాళ్లలో నిధులు కేటాయించేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ను రూపొందించారు. ఈసారి బడ్జెట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించేలా బడ్జెట్ కూర్పు సాగుతోంది. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపులకు ఎస్క్రో ఖాతాలు తెరుస్తామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. తల్లికి వందనం, దీపం-2.0, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. వివిధ వర్గాలకు అందించే సంక్షేమ పథకాలకూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది.

