ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కనెక్ట్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి
లారీ యజమానులు, ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎస్. శాంతకుమారి పిలుపు
కర్నూలు క్రైమ్, జూలై 24, (సీమకిరణం న్యూస్):
రాష్ట్రంలోని లారీ యజమానులు, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు, ఫ్లీట్ ఓనర్లు మరియు ఇతర రవాణా సంస్థలు “ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కనెక్ట్” మొబైల్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కర్నూలు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎస్. శాంతకుమారి పిలుపునిచ్చారు. రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు మరియు యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫాం సంయుక్త ఆధ్వర్యంలో ఈ మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. కర్నూలులో లారీ యజమానులు, డ్రైవర్ల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కనెక్ట్ ద్వారా రాష్ట్రంలోని రవాణా రంగాన్ని ఒకే డిజిటల్ లాజిస్టిక్స్ వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ వేదిక జాతీయ లాజిస్టిక్స్ వ్యవస్థతో అనుసంధానమై రవాణా రంగంలో పారదర్శకత, వేగం, సామర్థ్యం, సౌలభ్యం పెంపొందించేలా రూపొందించబడిందన్నారు. యాప్‌లో నమోదు చేసుకోవడం ద్వారా రవాణాదారుల వివరాలు ప్రభుత్వ ఆధారిత డిజిటల్ లాజిస్టిక్స్ వ్యవస్థలో నమోదు అవుతాయని, భవిష్యత్తులో డిజిటల్ సేవలు, వేగవంతమైన ధృవీకరణ, తక్కువ పేపర్‌వర్క్, సులభమైన సమాచార మార్పిడి, మెరుగైన వ్యాపార అవకాశాలు వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలవుతున్న యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫాం మరియు జాతీయ లాజిస్టిక్స్ విధానం లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టబడుతున్నదని తెలిపారు. జిల్లాలోని అన్ని లారీ యజమానులు, ట్రాన్స్‌పోర్ట్ సంస్థలు, ఫ్లీట్ ఓనర్లు, ఇతర రవాణాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కనెక్ట్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ ఎల్. భరత్ చవాన్, మోటార్ వాహన తనిఖీ అధికారులు మధుసూదన్, నాగరాజ్ నాయక్, అసిస్టెంట్ మోటార్ వాహన తనిఖీ అధికారి బాబు కిషోర్ పాల్గొన్నారు.