seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 12:02 pm Digital Edition : SEEMA KIRANAM

ఎమ్మెల్యే గళ్ళా మాధవిని అభినందించిన ఏపీజేఎఫ్ నేతలు

ఎమ్మెల్యే గళ్ళా మాధవిని అభినందించిన ఏపీజేఎఫ్ నేతలు

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యేకు ఏపీజేఎఫ్ కృతజ్ఞతలు

గుంటూరు, ఆగస్టు 21, (సీమకిరణం న్యూస్) :

 

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సమస్యలను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రస్తావించి, జర్నలిస్టుల పక్షాన గళమెత్తిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవిని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) నేతలు ఆమె నివాసంలో కలిసి అభినందించారు.
ఏపీజేఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ చెవుల కృష్ణాంజనేయులు ఆధ్వర్యంలో, ఏపీజేఎఫ్ గుంటూరు జిల్లా కమిటీ నేతలు ఎమ్మెల్యే గళ్ళా మాధవిని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, జర్నలిస్టుల సమస్యను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, వారికి సొంత ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించే వరకు తన వంతు కృషి చేస్తానని ఏపీజేఎఫ్ నేతలకు హామీ ఇచ్చారు.
అమరావతి వెలగపూడిలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా జీరో అవర్‌లో జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావిస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు నిర్వహిస్తున్న కీలక పాత్రను ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుర్తు చేయడం అభినందనీయమని ఏపీజేఎఫ్ గుంటూరు జిల్లా కమిటీ నేతలు పేర్కొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు పరిమిత ఆదాయంతో కుటుంబాలను పోషిస్తూ, సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీజేఎఫ్ నేతలు ఆమెకు వివరించారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా గృహ నిర్మాణ సౌకర్యం కల్పించాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జర్నలిస్టుల సంక్షేమం పట్ల ఎమ్మెల్యే గళ్ళా మాధవికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన హౌసింగ్ కాలనీలను ప్రస్తావిస్తూ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు గృహ సౌకర్యం కల్పించేందుకు గతంలో జారీ చేసిన జి.ఓ. నెం. 67, 107లను అమలు చేయాలని ఎమ్మెల్యే కోరడం స్వాగతించదగ్గ పరిణామమని ఏపీజేఎఫ్ పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అర్హత కలిగిన, ముఖ్యంగా అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా గృహ నిర్మాణ సౌకర్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీజేఎఫ్ గుంటూరు జిల్లా కమిటీ కోరింది. జర్నలిస్టుల హౌసింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ వంతు కృషి కొనసాగిస్తామని ఏపీజేఎఫ్ నేతలు తెలిపారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవిని కలిసిన వారిలో ఏపీజేఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెవుల రంగారావు, ఏపీజేఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.డి. సూర్యనాయక్, ఎస్.డి. హలీమ్, సీహెచ్. వెంకట్రావు, చిగురుపాటి సూర్యనారాయణ, సీహెచ్. వెంకట బ్రహ్మయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.