ఎంపీడీవో కార్యాలయంలో వేర్వేరుగా నామినేషన్లు దాఖలు..
తరలివచ్చిన గ్రామస్థులు, మద్దతుదారులతో సందడి
కర్నూలు ప్రతినిధి, నవంబర్ 22 (సీమకిరణం న్యూస్):

వెల్దుర్తి మండలంలోని ఎన్.నగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో దేశాయి లక్ష్మీదేవమ్మ, దేశాయి గాయత్రి నిలిచారు. సర్పంచ్ అభ్యర్థులుగా వీరిద్దరూ వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వేర్వేరుగా తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా ఎన్.నగరం గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, యువకులు, మహిళలు, మద్దతుదారులు వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. అభ్యర్థులు తమ ప్రతిపాదకులు, మద్దతుదారులతో కలిసి నామినేషన్లు దాఖలు చేయడంతో కార్యాలయ పరిసరాలు సందడిగా మారాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.
గ్రామాభివృద్ధే లక్ష్యం.. ఓటర్లకు అభ్యర్థుల విజ్ఞప్తి…
నామినేషన్ల అనంతరం దేశాయి లక్ష్మీదేవమ్మ, దేశాయి గాయత్రి మాట్లాడుతూ గ్రామస్థుల ఆశీస్సులు, మద్దతుతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచామని తెలిపారు. ఎన్.నగరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తమకు అవకాశం కల్పించి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వివిధ వర్గాల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.