seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 3:31 pm Digital Edition : SEEMA KIRANAM

ఎన్నికల వేళ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా!

సమస్యాత్మక గ్రామాల్లో ‘పల్లె నిద్రలు’ చేయాలి

 

 

ఎన్నికలకు ముందే సమస్యలను గుర్తించాలి

 

 

శాంతిభద్రతలకు పటిష్ట చర్యలు..!

 

 

బీట్ కానిస్టేబుళ్లు గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేయాలి

 

 

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

 

 

గ్రామాలపై పోలీసుల నిఘా ముమ్మరం.. ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌కు ఎస్పీ ఆదేశం

 

 

కర్నూలు క్రైమ్, అక్టోబర్ 06, (సీమకిరణం న్యూస్):

 

 

రాబోయే ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి, కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కర్నూలు తాలూకా పరిధిలోని సమస్యాత్మక గ్రామాల పరిస్థితులపై తాలూకా సీఐ తేజ మూర్తిని ఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక గ్రామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఆయా ప్రాంతాలకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో ‘పల్లె నిద్రలు’ నిర్వహించి గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని ఎస్పీ సూచించారు. బీట్ కానిస్టేబుళ్లు తరచుగా గ్రామాలను సందర్శిస్తూ స్థానిక పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు, వివాదాలు లేదా శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలు ఉంటే ముందుగానే గుర్తించాలని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో కర్నూలు తాలూకా సీఐ తేజ మూర్తి, ఎస్సైలు రామాంజనేయులు, మోహన్ కిషోర్, మల్లికార్జునతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.