ఎట్టకేలకు పులి బంధనం – గ్రామస్తులకు ఊరట
మండపేట : మండపేట నియోజవర్గం రాయవరం మండలం కూర్మ పురంలో ఎట్టకేలకు పెద్దపులి అధికారుల చేతికి చిక్కింది. గురువారం నుంచి ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న వార్త ప్రజల్లో కునుకు లేకుండా చేసింది. రాజనగరం మండలం నుండి మండపేట నియోజకవర్గం మండపేట మండలం వేములపల్లి కేశవరం ద్వారపూడి ప్రాంతాల్లో సంచరించినట్లు అటవీ పోలీస్ శాఖ అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం రాయవరం మండలం కూర్మాపురంలోని ఒక పాత పెంకుటిల్లులో ఉన్నట్టు అక్కడి స్థానికులు గుర్తించారు. పులి గాండ్రింపులు విన్నారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న జిల్లా అటవీ శాఖ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రెస్క్యూ టీం తో అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. డ్రోన్ కెమెరాతో పులిజాడను గుర్తించారు. ఈలోగా ఆ భవనం నుంచి పులి బయటకు వచ్చి పంటచేలలో అటు ఇటు యదేచ్చగా సంచరించింది. ప్రజలు పులిని చూసి తమ వీడియోలో దృశ్యాలు బంధించారు. పెద్ద ఎత్తున అహకారాలు చేశారు. కొంత దూరం ప్రయాణం చేసిన పులి తిరిగి దిశను మార్చుకుని కూర్మాపురంలోని ఒక తాటాకు పాకలోకి వెళ్ళింది. అక్కడే ఉన్న లేక దూడను తింటూ కూర్చున్నట్లు అధికారులు గమనించారు. ఆ పాక చుట్టూ వల ఏర్పాటు చేశారు. బయటకు వచ్చిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న సిబ్బంది మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. దీంతో మత్తుగా పడిపోయి ఉన్న పులి వద్దకు వెళ్లి బంధించి బోనులో ఎక్కించారు. ఇక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు. ఉదయం సమాచారం అందుకున్న రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అక్కడికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. అధికారులకు సహకరించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం సాయంత్రం సంధ్యా సమయంలో పులి అధికారులకు చిక్కింది. రిస్కీ టీంలో అధికారులు ఉదయం నుంచి కృషి చేశారు. గత నాలుగైదు రోజులుగా జిల్లా వ్యాప్తంగా పులి సంచరిస్తుందని సమాచారం తో ప్రజలు ఆందోళన చెందారు. ఈ క్రమంలో పులి పట్టుబడటం తో జనం ఊపిరి పీల్చుకున్నారు.

