తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
ఉద్యోగులకు బిగ్ అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య పథకంలో మార్పులకు సిద్దమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పధకం అమలు కానుంది. ఈ కొత్త పథకం పైన ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు. పాత పథకంలో ఉన్న పలు లోపాలను సవరించి కొత్త ఆరోగ్య పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ఆరోగ్య పథకానికి ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం’గా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య సేవలను రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా అందించారు. ఈ సేవలు నామమాత్రంగానే ఉన్నాయనే అభిప్రాయం ఉద్యోగుల్లో ఏర్పడింది. కాగా, బకాయిలు సరిగ్గా చెల్లించకపోవటంతో ఈహెచ్‌ఎస్ కార్డులు కొన్నిచోట్ల చెల్లుబాటు కావటం లేదని ఉద్యోగులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మొదట నగదు చెల్లించి, క్లెయిమ్ చేసుకుంటున్నప్పటికీ మొత్తం నగదు తిరిగి రావడం లేదు. దీంతో ఉద్యోగులు కాస్త ఇబ్బందులకు గురౌతున్న ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఉద్యాగుల కాంట్రిబ్యూషన్ పైనా తాజాగా కీలక ప్రతిపాదన చేసారు.

ఉద్యోగుల భాగస్వామ్యం
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కొత్తగా అమలయ్యే పథకం తాజా ఉద్యోగుల బేసిక్ నుంచి ఒకటిన్నర శాతం నగదు భాగస్వామ్యంతో అమలు చేయబడుతోంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఒక ప్రభుత్వ ఉద్యోగికి రూ.50 వేల బేసిక్ ఉంటే నెలకు రూ.750 వరకు కొత్త పథకంలో ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌గా చెల్లించాల్సి ఉంటుంది. గురువారం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకం అమలు విధి విధానాలపై పూర్తి స్పష్టత రానుంది. ముందుగా ఈ బీమా విధానంలో అమలు చేయాలనుకున్నా తర్వాత ట్రస్టు విధానంలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్యవేక్షణలోనే ఇది కొనసాగనుంది. ఉద్యోగుల బకాయిల విషయంలోనూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల మేరకు ప్రతీ నెల విడుదల చేసింది. ఇక, ఆరోగ్య శ్రీ పథకంలోనూ కొత్త మార్పులు.. ఉద్యోగుల భాగస్వామ్యంతో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

