ఈ నెల 14న ‘జాతీయ లోక్ అదాలత్’
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి
కర్నూలు లీగల్, మార్చి 12, (సీమకిరణం న్యూస్) :
ఈ నెల 14న ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ‘జాతీయ లోక్ అదాలత్’ నిర్వహించబడుతోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. బుధవారం స్థానిక కోర్టు కాంప్లెక్స్ లోని న్యాయ సేవ సదన్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఈ నెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ అంశం పై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (న్యూ ఢిల్లీ) మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (అమరావతి) వారి ఆదేశాల మేరకు, జిల్లా జడ్జి జి.కబర్థి గారి సూచనల ప్రకారం, ఈ నెల 14న (రెండవ శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందన్నారు. కేసులను త్వరగా పరిష్కరించి, ప్రజలు సంతోషంగా ఇంటికి వెళ్లేలా చూడాలనే ఉద్దేశంతో మొత్తం 17 బెంచ్లను ఏర్పాటు చేశామన్నారు. చిన్నపాటి గొడవలు, రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులు, వైవాహిక వివాదాలు, ఇన్సూరెన్స్, బ్యాంక్ కేసులు, భార్యాభర్తల గొడవలు, మెయింటెనెన్స్ మరియు ఆస్తి పంపకాల వంటి కేసులు, ఆస్తి తగాదాల వంటి ఏళ్ల తరబడి సాగే కేసులను సీనియర్ జడ్జిలు మరియు అడ్వకేట్ల సమక్షంలో చర్చించుకుని, సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కోరారు. లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా న్యాయం చాలా త్వరగా దొరుకుతుందన్నారు. కోర్టు ఖర్చులు మరియు ఇతర వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయన్నారు. సాధారణంగా మనం ఏదైనా ఒక కేసును తీసుకుంటే, ఇరు పార్టీలలో ఒకరు మాత్రమే గెలుస్తారు. ఓడిపోయిన పార్టీ మళ్ళీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంటుందని, కానీ లోక్ అదాలత్‌లో అలాంటి అవకాశం ఉండదన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. దీనివల్ల మన తరమే కాకుండా, రాబోయే తరాల వారు కూడా ఆస్తిని లేదా ఇతర అంశాలను ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా అనుభవించవచ్చన్నారు. అందుకే, వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ అనేది ఒక ఉత్తమ మార్గం అన్నారు. కాబట్టి, కక్షిదారులందరూ ఈ నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.