బళ్లారి చౌరస్తా దోపిడీ కేసు ఛేదన
ఇద్దరు దోపిడీ దొంగల అరెస్టు.. చోరీ సొత్తు స్వాధీనం
కర్నూలు క్రైమ్, జూలై 15, (సీమకిరణం న్యూస్):
నగరంలోని బళ్లారి చౌరస్తా వద్ద అర్ధరాత్రి సమయంలో జరిగిన దోపిడీ కేసును కర్నూలు పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే..నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన షఫీ ఈ నెల 13న హైదరాబాద్ నుండి కర్నూలుకు చేరుకున్నాడు. సొంతూరికి వెళ్లేందుకు బళ్లారి చౌరస్తా వద్ద అర్ధరాత్రి సమయంలో వాహనం కోసం వేచి చూస్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అతని వద్దకు వచ్చారు. డబ్బులు ఇవ్వాలంటూ షఫీని బెదిరించగా, అతను నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకులు షఫీపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఛార్జర్, మనీ పర్స్‌లోని నగదును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం..
బాధితుడి ఫిర్యాదు మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ (ఐపీఎస్) ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, నిందితులను బాలాజీ నగర్‌కు చెందిన మణికుమార్, అరుణ్ కుమార్‌లుగా గుర్తించారు. ఎస్‌ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సుబ్బరాయుడు, మురళిలతో కూడిన ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టి, చెన్నమ్మ సర్కిల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి అపహరించిన సొత్తును రికవరీ చేసి, నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
పాత నేరస్థులుగా గుర్తింపు..
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులిద్దరికీ పాత నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. మణికుమార్‌పై గతంలో రెండు, అరుణ్ కుమార్‌పై ఐదు కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ గతంలో పలు ఇళ్ల దొంగతనాలు, మోటార్‌సైకిల్ చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు.
డయల్ 112కు సమాచారం ఇవ్వండి : పోలీసులు
ప్రజలు తమ పరిసరాల్లో ఎలాంటి నేరాలు జరిగినా, అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నా లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే ‘డయల్ 112’ కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కర్నూలు జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.