ఆర్టీసీ బస్టాండ్‌లో టీ స్టాల్ యజమానిపై దాడి
వేడి టీ పాత్రతో దాడి చేసిన ముగ్గురు అరెస్టు
కర్నూలు క్రైమ్, జూలై 15, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్‌లో టీ స్టాల్ నిర్వహిస్తున్న వ్యక్తిపై వేడి టీ పాత్రతో దాడి చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. గోరంట్ల గ్రామానికి చెందిన నాగరాజు కర్నూలు ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్‌లో టీ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి సమయంలో కర్నూలు ఇందిరానగర్‌కు చెందిన ఉదయ్ కుమార్, వినోద్, నవీన్ టీ స్టాల్‌కు వచ్చి టీ, సిగరెట్లు ఇవ్వాలని కోరారు. సిగరెట్ల ధర విషయంలో టీ స్టాల్ యజమాని నాగరాజు, నిందితుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో నిందితులు మరుగుతున్న వేడి టీ ఉన్న పాత్రను నాగరాజుపైకి విసరడంతో అతని ఛాతి భాగంలో తీవ్ర కాలిన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు ఉదయ్ కుమార్, వినోద్, నవీన్‌లను అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించినట్లు తెలిపారు. చిన్నచిన్న విషయాలకు గొడవలకు దిగకుండా సంయమనంతో వ్యవహరించాలని, ఎక్కడైనా నేరాలు, గొడవలు, అనుమానాస్పద వ్యక్తులు లేదా అత్యవసర పరిస్థితులు కనిపించిన వెంటనే డయల్-112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కర్నూలు పోలీసులు ప్రజలకు సూచించారు.