ఆన్లైన్ రమ్మీ వ్యసనానికి కుటుంబం బలి..!!
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నారాయణవనం మండలం వెంకట కృష్ణపాలెంకు చెందిన మోహన్ బుధవారం తన తల్లి చంద్రకళ, భార్య హరితలను ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం స్కూల్‌కు వెళ్లి, మావయ్య చనిపోయాడని అబద్ధం చెప్పి తన ఇద్దరు పిల్లలు కౌశిక్ (14), హరిణి (12)లను ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లలను ఇంట్లోకి వెళ్లనీయకుండా బయట నుంచి స్కూటీపై ఆ ప్రాంతంలో తిప్పి, చివరికి రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మోహన్ వేగంగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలిద్దరూ రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆన్‌లైన్ రమ్మీతో అప్పుల ఊబి..
మోహన్ కొంతకాలంగా ఆన్‌లైన్ రమ్మీకి బానిసై, రూ.40 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. ఉన్న ఆస్తులు, బంగారం అమ్మి అప్పులు తీర్చినా, ఇంకా అప్పుల ఊబిలోనే కూరుకుపోయాడు. ఈ ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని సమాచారం. ఈ క్రమంలోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన మరణానంతరం వచ్చిన ఉద్యోగాన్ని కూడా మోహన్ వదిలేశాడు. అతని భార్య హరిత బ్యూటీపార్లర్, టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల చీటీ డబ్బులతో భర్తకు ఒక సిమెంట్ షాపు కూడా పెట్టించింది. అయినా మోహన్ తన వ్యసనాన్ని వీడలేక మొత్తం కుటుంబాన్ని బలితీసుకున్నాడు. గురువారం ఐదు మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..!!