అసెంబ్లీలో నిమ్మల వ్యాఖ్యలు అర్థరహితం
• కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష
గుండ్రేవుల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరికి ప్రత్యేక కృతజ్ఞతలు : ఎం.శ్రీహర్ష
కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 21, (సీమకిరణం న్యూస్) :
జిల్లా ప్రజల జీవనాధారంగా భావిస్తున్న గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష పేర్కొన్నారు. శనివారం బిర్లా కాంపౌండ్‌లోని కేపిఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, వివిధ సాకులు ప్రస్తావిస్తూ ప్రక్రియను వాయిదా వేయాలనే భావనతో మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్రామాలు, కర్ణాటకలో ఒక గ్రామం ముంపునకు ప్రభావితమవుతాయని అది క్లిష్టమైన ప్రక్రియ కాకపోయినా దాన్ని సాకుగా చూపడం సరైంది కాదన్నారు. వాస్తవానికి ఆయా ప్రాంతాల ప్రజలకే అధిక ప్రయోజనం చేకూరే ఈ ప్రాజెక్టును పరస్పర చర్చలతో పరిష్కరించవచ్చని శ్రీహర్ష స్పష్టం చేశారు. కేఆర్‌ఎంబి, సిడబ్ల్యుసి, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు అవసరమని పేర్కొనడం పరిపాలనా ప్రక్రియలో భాగమేనని, అయితే వాటిని సాధించేందుకు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతేనని గుర్తుచేశారు. తగిన సమన్వయం, చర్చల ద్వారా అనుమతులు పొందడం సాధ్యమేనని తెలిపారు. అనేక ఇబ్బందులు, ఒత్తిళ్ల మధ్య కేపిఎస్ కొనసాగిస్తున్న ఉద్యమానికి ప్రభుత్వంలో స్పందన కనిపించడం స్వాగతించదగినదే అయినప్పటికీ, చట్టసభలో నిరుత్సాహపరిచే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తమ ఉద్యమాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు బెదిరింపులు, ఫ్లెక్సీల తొలగింపులు వంటి అనుచిత చర్యలకు పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేపిఎస్ నిరంతర పోరాటం ఫలితంగానే ప్రభుత్వ స్థాయిలో కదలిక ప్రారంభమైందన్నారు. జలసమర దీక్షలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, లక్షలాది కరపత్రాల పంపిణీ, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారికి లేఖలు పంపడం, గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు, పోస్టర్ల ఆవిష్కరణ వంటి ఉద్యమ కార్యక్రమాల వల్లే చర్చలు వేగవంతమయ్యాయని తెలిపారు. అసెంబ్లీలో గుండ్రేవుల ప్రాజెక్టు అవసరాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైల్ బండి ఉందని బొంబాయికి, భాషా వచ్చని బళ్ళారికి, చదువు లేక ఉపాధికి గుంటూరుకు, చదువు ఉన్నా ఉపాధికి హైదరాబాద్, బెంగళూరులకు ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్తున్న పరిస్థితి ఆందోళనకరమన్నారు. ప్రభుత్వం మానవతా దృష్టితో ఆలోచించి ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘ నాయకులు పులకుర్తి భాస్కర్ రెడ్డి, గూడూరు నాగిరెడ్డి, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ మన్సూర్ రహేమాన్, కేపిఎస్ సభ్యులు నౌషద్, హరినాథ్, శ్రీనివాసులు, ప్రేమ్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.