seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 6:39 am Digital Edition : SEEMA KIRANAM

అసాధ్యాలను సుసాధ్యం చేసే దార్శనికుడు!

*💥నారా చంద్రబాబు నాయుడు : అసాధ్యాలను సుసాధ్యం చేసే దార్శనికుడు!*

 

భూమ్మీదకు ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. జన్మభూమి కోసం వచ్చేవారు కొందరుంటారు, వారిలో చంద్రబాబు ఉంటారు. ఒక మనిషి వయస్సును కొలవటానికి సంవత్సరాలే కొలమానం అయితే, చంద్రబాబు డెబ్బై అయిదు వసంతాలను దాటి డెబ్బై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. గత యాభై సంవత్సరాలుగా ఆయన వార్తల్లో వ్యక్తి. ఆయన గురించి ఇప్పటికీ అర్థం కాని విషయం—ఒక ఎగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అంతటి సాహసోపేతమైన కలలు ఎలా కన్నారు అని. బహుశా ఆయన కుటుంబ నేపథ్యం ఆయనను చదివించటానికి సరిపోతుంది కానీ, ఆయన రాజకీయాలలో ఎదగడానికి ఖర్చు పెట్టగలిగే శక్తివంతమైనది కాదు. ఈరోజుల్లో మాదిరి శాసనసభ్యుడు కావాలంటే కోట్లు అవసరం ఉండి ఉండకపోవచ్చు, కానీ అస్సలు డబ్బులు ఖర్చు పెట్టకుండా శాసనసభ్యుడు అవటం ఆ రోజుల్లో కూడా అసాధ్యమే. కానీ తన రాజకీయ భవిష్యత్తు గురించి చంద్రబాబు కలకనటమే కాకుండా, సాకారం చేసుకోవటానికి ఆయన వెనుకాడలేదు. ఇప్పుడు అమరావతి రాజధానిని ‘సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ’గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా ‘సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం’ ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను “మనం చేయలేమా? చేయగలం” (Yes, we can) అనే మాటతో ముగించేవాడు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి “నేను చేయగలను” (I can do) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు. బహుశా అందుకేనేమో, ఇప్పటివరకు ఆయన జీవితమంతా అసాధ్యాలను సుసాధ్యం చేయటమే పనిగా పెట్టుకున్నారు. సవాళ్లను స్వీకరించటం ఆయన నైజం. అందుకే అప్పటికే మహామహులు నాయకులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో, చిత్తూరు జిల్లాలో పెద్దగా ప్రాధాన్యత లేని సామాజికవర్గం నుండి వచ్చిన ఆయన, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబానికి చెందిన ఒక సామాన్యుడు శాసనసభకు ఎందుకు వెళ్ళలేడు అనే సవాలును అతి పిన్నవయస్సులో స్వీకరించాడు. సామాన్యుడిగా వచ్చిన ఆయన ఈరోజు అసామాన్యతనే సామాన్యతగా రూపాంతరం చెందేలా చేయగలిగాడు. దానికి తార్కాణం చంద్రబాబు రాజకీయ ప్రస్థానమే కాదు, ఆయన నాయకత్వంలో ఎదిగిన తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీ నిర్మాణంలో, అంచలంచెల నాయకత్వ విధానంలో కమ్యూనిష్టులను అనుకరించే చంద్రబాబు, అనుసరించేది పెట్టుబడిదారీ వ్యవస్థను. ఆయన ఐడియాలను పెట్టుబడిగా పెట్టి పెట్టుబడిదారులను ఆకర్షిస్తాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ రూపురేఖలు ఎలా అల్లుకుపోతాయో అనే మాట పక్కన పెడితే, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పనే ఆయన లక్ష్యం. దార్శనికుడు అంటారు, కానీ అన్వేషణ ఆయన సహజగుణం. రేపు రాబోయే సమాజం ఎలా ఉంటుందో దర్శించగలగటం ఒకెత్తు అయితే, ఆ సమాజానికి అవసరమైన పునాదులను అన్వేషించటం ఆయన ప్రత్యేకత. ఇప్పటి ప్రపంచం తీరుతెన్నులకు తనను తాను మలచుకుంటాడు. ఆయన మీద ఉండే ప్రధానమైన విమర్శ కూడా అదేనేమో! అవసరాలకు అనుగుణంగా తన పార్టీ విధివిధానాలను, తన పాలనా తీరును మార్చుకోవటం అవకాశవాదం అయితే, ఆయన ఖచ్చితంగా అవకాశవాదే. కానీ ఆయన నమ్మేది ‘అవసరమే ఆవిష్కరణకు తల్లి’. ప్రజల అవసరాలను తీర్చటమే తన విధానాల అన్వేషణకు మూలం అనుకుంటాడు చంద్రబాబు.తన పార్టీ బతికి ఉండాలి, తన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనే చిన్న ఆశయానికి అనుగుణంగా ఆయన అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. సమకాలీన రాజకీయాలలో ఆయన ఎప్పుడూ ఒక ప్రశ్నగానే మిగిలిపోయాడు. రేపు రాబోయే ఎన్నికలలో ఆయన ఎటువంటి స్టాండ్ తీసుకుంటాడో ఎవరికీ తెలియదు. అప్పటి అవసరాలు ఎలా ఉంటాయో ఊహించే ప్రయత్నంలో ఇప్పటి సమయాన్ని వృధా చేసుకోవటం ఆయనకు ఇష్టం ఉండదు, దానికి ఎవరు ఏ పేరు పెట్టినా ఆయన లెక్క చేయడు. అయితే ఆయన ఆలోచనలు రాష్ట్ర అవసరాల మేరకే పరిమితమైపోయాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాడే కానీ, దేశ విదేశీ విధానం గురించి ఆలోచించే ప్రయత్నం చేయడు. బహుశా సుదీర్ఘకాలం తన పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో జత కట్టించి ఉంచటం వలనేమో, రాష్ట్రానికి ఆవల ఏమీ జరిగినా ఆయన పట్టించుకోరు. ప్రపంచంలోని అతి పెద్ద సంస్థలు ఆయనలోని దార్శనికుని చూస్తున్నాయి కానీ, స్వదేశ రాజకీయాలలో ఆయన పాత్ర చాలా పరిమితం అయిపోయింది. ఇదే ఎన్డీయే వాజ్ పేయి నాయకత్వంలో పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు, దేశంలో మౌలిక వసతుల రూపకల్పన లాంటి విషయాలలో తనదైన ముద్రను వేసిన చంద్రబాబు, ఈరోజు కేంద్రప్రభుత్వానికి ఒక పిల్లర్ అయినా జాతీయ విధానాల రూపకల్పనలో ఆయన పాలుపంచుకోవటం లేదు. బహుశా మారిన రాజకీయ ముఖచిత్రంలో ఆయన తన పాత్రను రాష్ట్రం వరకే పరిమితం చేసుకున్నారేమో అనిపిస్తుంది. ఇది మాత్రం దేశానికి నష్టం. అయితే ఆంధ్రరాష్ట్రానికి ఆయన అవసరం ఎంత ఉన్నదంటే, ఆయన మరో డెబ్బై అయిదు వసంతాలు జరుపుకోవాలన్నంతగా!  ఒకనాడు ఆయన ఐటీ వైపు మొగ్గు చూపినప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు అంతులేని భేదం ఉన్నది. ఐటీ సెక్టార్ నిరాటంకంగా పాతిక సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యమేలింది. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ఉద్యోగాలను తగ్గించటమే కాక, ఉన్న ఉద్యోగులనే తీసివెయ్యవలసిన పరిస్థితిని తీసుకువస్తున్నది. కొత్తగా వచ్చిన సాంకేతికత ఎంతకాలం మనుగడ సాగిస్తుందో ఎవరూ ఊహించను కూడా ఊహించలేకపోతున్నారు. ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, సాంకేతిక రంగానికి ఆవల కూడా ఉద్యోగ ఉపాధి కల్పన జరిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. వీటన్నిటికంటే మిన్నగా కుదేలయిపోయి ఉన్న వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టాలి. వ్యవసాయాధారిత రాష్ట్రంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో, వ్యవసాయం అంతకంటే ముఖ్యం. ఇక చంద్రబాబు మానస పుత్రిక, ప్రజా రాజధాని అమరావతి ఉండనే ఉన్నది. చంద్రబాబు డెబ్బై ఏడవ జన్మదిన వేడుకల నాటికి అమరావతికి ఒక రూపం తీసుకువస్తేనే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. భిన్న కోణాల దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు వలనే సాధ్యం అనే విషయాన్ని ఎవరూ విభేదించలేరు. అందరికీ వయస్సు పెరిగే కొద్దీ బాధ్యతలు తగ్గుతాయి, కానీ సమస్యను సవాలుగా స్వీకరించేవారిపై బాధ్యతలు పెరుగుతాయి. అందుకని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, ఆయన బాధ్యతల భారాన్ని గుర్తుచేస్తూ ఉంటారు. బహుశా ఆయన కోరుకునేది కూడా ఇటువంటి శుభాకాంక్షలనే అనుకుంటాను. తెలుగుజాతి అస్తిత్వానికే చిహ్నంగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.! బాబు