తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->తనకు అకారణంగా విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్న కారణంగా మాజీ భార్యను మాజీ భర్త అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జరిగింది. ఇంట్లోకి చొరబడి మరీ కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా కాలనీ వాసులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహేశ్, సునీత ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. 2023లో పెళ్లి చేసుకుని హాయిగా అమెరికాలో కాపురం మొదలు పెట్టారు. అయితే పెళ్లి జరిగిన కొన్నాళ్లకే మహేశ్, సునీతల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దాంతో విసిగిపోయిన సునీత హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. చట్టబద్ధంగా మహేశ్‌కు విడాకులు ఇచ్చారు.
కొత్త జీవితం ప్రారంభించాలన్న ఉద్దేశంతో రెండో వివాహం చేసుకుంది. అయితే.. తనకు అకారణంగా విడాకులు ఇచ్చి వేరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని మహేశ్ జీర్ణించుకోలేక పోయాడు. సునీత తనను మోసం చేసిందని ఎలాగైనా పగ తీర్చుకోవాలని పథకం వేశాడు. అలా సునీతను హతమార్చేందుకు అమెరికా నుంచి భారత్ కు తిరిగి వచ్చాడు.
అలా ఫిబ్రవరి 18 న వనస్థలిపురం పరిధిలోని గ్రీన్‌సిటీ కాలనీలో రెండో భర్తతో ఉంటున్న సునీత ఇంట్లోకి చొరబడ్డాడు. పెట్రోల్ డబ్బా, సా మెషిన్, రెండు కత్తులతో ఇంట్లోకి దూరాడు. ఎవరైనా అడ్డం వస్తే పెట్రోల్ పోసి నిప్పంటిస్తా అని హెచ్చరించాడు. కత్తులతో సునీత తలపై దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన జరిగినప్పుడు సునీత అత్త, మరిది ఇంట్లోనే ఉన్నారు.

అయినా మహేశ్.. ఏమాత్రం భయపడకుండా సునీత గదిలోకి వెళ్లి గొళ్లెం పెట్టి హత్య చేశాడు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మహేశ్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.