తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఇటీవల కాలంలో అమెరికాలో స్థిరపడిన వారి హఠాన్మరణాలు ఆందోళనకరంగా మారాయి. అమెరికాకు చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు, అమెరికాలో సెటిల్ అయిన తెలుగువారు, అమెరికాలో పిల్లలను చూడడానికి వెళ్లిన తల్లిదండ్రులు గుండెపోటుతో హఠాన్మరణం చెందుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగిస్తున్నాయి.
గుండెపోటుతో యూఎస్ లో మరణించిన వరంగల్ వ్యక్తి
తాజాగా అమెరికాలో స్థిరపడ్డ ఓ తెలుగు యువ ఇంజినీర్ హఠాన్మరణం చెందడం కుటుంబసభ్యులు, స్నేహితులను విషాదంలో ముంచింది. వరంగల్‌కు చెందిన 40 సంవత్సరాల తాడిపత్రి రాకేశ్ వర్జీనియా రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీతో కలిసి జీవిస్తున్నాడు . తాజాగా అతను గుండెపోటుతో మృతి చెందాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది.

కుటుంబంతో కలిసి జీవిస్తున్న రాకేష్
రాకేశ్ వరంగల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జితేందర్ కుమారుడు. ఉన్నత చదువులు పూర్తిచేసిన అనంతరం రాకేష్ గత పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో ఆయన వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి వర్జీనియాలో రూపొందించారు.
వరంగల్ లో విషాదం
ఎంతో భవిష్యత్తు ఉన్న రాకేశ్ చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూయడం కుటుంబసభ్యులను, బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాకేష్ మరణ వార్త తెలిసిన వెంటనే వరంగల్‌లోని బంధువులు, స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాకేశ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషాద ఘటనతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
యూఎస్‌లో మరణించిన వరంగల్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయిని
ఇటీవల అమెరికాలో వరంగల్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని కూడా గుండెపోటుతో మరణించారు. వరంగల్ పైడిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న చిదురాల విజయ రాణి తన చిన్న కుమార్తె పూజకు కుమారుడు జన్మించడంతో వారిని చూసి రావడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ఆమెకు గుండెపోటు రావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మూడు రోజులైనా కాకముందే తాజాగా రాకేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుండెపోటుతో మరణించాడు.

