హత్య కేసులో ఇద్దరు ముద్దాయిల అరెస్ట్
అప్పు వివాదమే హత్యకు కారణం..
డీఎన్‌ఏ నివేదిక కోసం పుర్రె స్వాధీనం
కర్నూలు క్రైమ్, జూలై 07 (సీమకిరణం న్యూస్):
కల్లూరు ఎస్టేట్ చింతలముని నగర్‌కు చెందిన కొండపల్లి శ్రీనివాసులు అదృశ్యమైన కేసును ఛేదించిన పోలీసులు, దానిని హత్య కేసుగా నిర్ధారించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, కొండపల్లి శ్రీనివాసులు మే 13 నుంచి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు ఆయన తిరిగి వస్తారనే ఆశతో జూన్ 20 వరకు వేచి ఉండి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కాల్ డేటా, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో శ్రీనివాసులు, అదే ప్రాంతానికి చెందిన మేస్త్రీ మౌలాలి గతంలో స్నేహితులని, మౌలాలి ఇచ్చిన అప్పు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని వెల్లడైంది. ఈ క్రమంలో శ్రీనివాసులు గతంలో రెండుసార్లు మౌలాలిపై దాడి చేసినట్లు విచారణలో తేలింది. దీనిని మనసులో పెట్టుకున్న మౌలాలి, తనతో కలిసి సెంట్రింగ్ పని చేసే యువరాజ్ అలియాస్ అభి సహాయంతో శ్రీనివాసులను హత్య చేయాలని పథకం రచించాడు. మే 13 రాత్రి శ్రీనివాసులను ఫోన్ చేసి సంతోష్‌నగర్ నుంచి తీసుకెళ్లి, చిన్నమ్మ సర్కిల్‌లో మద్యం కొనుగోలు చేసి, అనంతరం కల్లూరు ఎస్టేట్‌లోని శ్రీ గోడ ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని వెంచర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం సేవించిన అనంతరం మాటామాటా పెరగడంతో, ముందే వేసుకున్న పథకం ప్రకారం ఇద్దరూ కలిసి శ్రీనివాసులపై దాడి చేసి, బండరాయితో తలపై బలంగా మోది హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. విచారణలో లభించిన ఆధారాల మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదు ఆలస్యంగా రావడంతో, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, స్థానిక యువకుల సహకారంతో శివారు ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మృతదేహం పూర్తిగా లభించలేదు. అయితే ఘటనాస్థలికి సమీపంలో లభించిన ఒక పుర్రెను స్వాధీనం చేసుకుని, అది శ్రీనివాసులదేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్ష కోసం నిపుణులకు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు.